ఉపఎన్నికలు రిఫరెండమే: లగడపాటి

25/03/2012 08:32

 

                త్వరలో 18 నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి రిఫరెండమేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలోని కృష్ణా, విజయనగరం మినహా మిగతా 11 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఇవి ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో అందరూ సమష్టిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

                    మీరు బాధ్యత తీసుకుంటారా.. అని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్‌లో అది సాధ్యం కాదన్నారు. ఎంపీగా ఉన్న తాను అన్ని ప్రాంతాల బాధ్యత తీసుకోలేనన్నారు. ఉపఎన్నికల్లో ఓటమికి సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలే కారణమంటున్న వారు కనీసం ప్రచారం నిర్వహించారా..? అని విరుచుకుపడ్డారు. కోవూరులో ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబం ఎనిమిది సార్లు గెలిచిందని వారికి అక్కడ మంచి పట్టుందన్నారు. అవినీతిరహిత పాలన అందిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు.