ఒలింపిక్స్ అవకాశం ఎవరికో!

06/04/2012 13:50

 

భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని పట్టుదలగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కశ్యప్‌కు ఇంకా అవకాశం మిగిలే ఉంది.

 

కశ్యప్, జయరామ్ మధ్య పోటీ
రెండు విభాగాల్లో జ్వాలకు చాన్స్!

హైదరాబాద్, న్యూస్‌లైన్: https://www.sakshi.com/newsimages/contentimages/06042012/kasyap5-4-12-54363.jpgఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని పట్టుదలగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్‌కు ఇంకా అవకాశం మిగిలే ఉంది. జూలై 27నుంచి ఆగస్టు 12 వరకు లండన్‌లో ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనే ఆటగాళ్ల ఎంపికకు ఏప్రిల్ 30ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఆలోగా బీడబ్ల్యుఎఫ్ (అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య) అంతర్జాతీయ ర్యాంకులు పరిగణనలోకి తీసుకొని ఒలింపిక్స్ అర్హత జాబితాను ప్రకటిస్తారు. ఈ నెలాఖరులోగా రెండు ప్రధాన టోర్నీలు ఉన్నాయి. ఏప్రిల్ 17నుంచి 22 వరకు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (గ్రాండ్ ప్రి గోల్డ్), 24నుండి 29 వరకు ఇండియా ఓపెన్ (సూపర్ సిరీస్) జరగనున్నాయి. ఒలింపిక్స్‌కు అర్హత పొందాలంటే ఈ రెండు టోర్నీల్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది. 

కశ్యప్ సత్తాకు పరీక్ష

మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న సైనా నెహ్వాల్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఖాయం. మరో క్రీడాకారిణికి మాత్రం సింగిల్స్‌లో అవకాశం లేదు. పురుషుల సింగిల్స్‌లో కూడా మన దేశంనుంచి ఒక్క ఆటగాడే (భారత నంబర్‌వన్) అర్హత పొందుతాడు. బీడబ్ల్యుఎఫ్ గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జయరామ్ 27వ, పారుపల్లి కశ్యప్ 30వ స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో కశ్యప్ రెండో రౌండ్‌లో, అజయ్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. అయితే రాబోయే రెండు టోర్నమెంట్లలో కశ్యప్, జయరామ్‌కంటే మెరుగైన ప్రదర్శన ఇస్తే కశ్యప్‌కు ఒలింపిక్స్ చాన్స్ ఉంటుంది. జయరామ్‌కంటే కశ్యప్ దాదాపు వేయి పాయింట్లు వెనుకబడ్డా రెండూ మేజర్ టోర్నీలు కావడంతో ఆ తేడాను కశ్యప్ అధిగమించే అవకాశం కూడా ఉంది. 

ముందుండాలి...
ఒలింపిక్స్‌కు అర్హత పొందేందుకు కశ్యప్‌కు ఇంకా అవకాశం ఉంది. ఈ రెండు టోర్నమెంట్లలో అతను జయరామ్‌కంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఫలితాల్లో జయరామ్‌కంటే ఒక్కో అడుగు ముందుండాలి. అంటే ప్రి క్వార్టర్స్‌నుంచి వారి మధ్య పోటీ ఉంటుంది. జయరామ్ ప్రి క్వార్టర్ చేరితే కశ్యప్ క్వార్టర్... జయరామ్ క్వార్టర్ చేరితే కశ్యప్ సెమీస్...దీనిని రెండు టోర్నమెంట్లలోనూ కొనసాగిస్తే అతను జయరామ్‌ను వెనక్కి నెట్టి ఒలింపిక్స్‌కు చేరతాడు. 
-పుల్లెల గోపీచంద్


జ్వాలకు దాదాపు ఖాయం

మరో వైపు మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా భారత జోడీలు లండన్ ఒలింపిక్స్‌లో అడుగు పెట్టే అవకాశముంది. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప, మిక్స్‌డ్ డబుల్స్‌లో జ్వాల-వి.దిజులకు చోటు దాదాపు ఖాయమైంది. నిబంధనల ప్రకారం టాప్-8 ర్యాంకుల్లో ఉండే మూడు జోడీలకు, టాప్-16లో ఉంటే రెండు జోడీలకు అవకాశం లభిస్తుంది. అయితే ర్యాంకింగ్ జాబితాలో చైనా, జపాన్ క్రీడాకారిణులు ఎక్కువ మంది ఉండటంతో ఆయా దేశాలకు చెందిన తర్వాతి జంటలకు అర్హత దక్కదు. దాంతో తర్వాతి ర్యాంకుల్లో ఉన్న క్రీడాకారిణులు ముందుకు వస్తారు. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని 20వ ర్యాంకులో ఉన్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. జ్వాల-దిజు ర్యాంకు 16. కాబట్టి దీని ప్రకారం రెండు విభాగాల్లోనూ జ్వాల ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం ఉంది. రాబోయే రెండు టోర్నీలలో ఏ ఒక్కదానిలో మంచి ప్రదర్శన ఇచ్చినా (కనీసం సెమీస్) నేరుగా ఒలింపిక్స్ బెర్త్ ఖాయమవుతుంది.