జూనియర్ కోచ్ పదవి నుంచి తొలగించిన హెచ్‌ఐ

14/03/2012 22:20

  తనకు మాట మాత్రమైనా చెప్పలేదని ముకేశ్ ఆవేదన హైదరాబాద్, న్యూస్‌లైన్: భారత హాకీకి విశేషంగా సేవలందించి, మూడుసార్లు ఒలింపిక్స్‌లో ఆడిన రాష్ట్ర ఆటగాడు నందనూరి ముకేశ్ కుమార్ పట్ల హాకీ ఇండియా (హెచ్‌ఐ) మరోసారి నిర్దయగా వ్యవహరించింది. భారత జూనియర్ హాకీ టీమ్ చీఫ్ కోచ్‌గా ఉన్న ముకేశ్‌ను చెప్పా పెట్టకుండా తొలగించింది. అతని స్థానంలో మరో మాజీ ఆటగాడు బల్జీత్ సింగ్ సైనీని ఎంపిక చేసింది. గత ఐదు నెలల్లో ముకేశ్‌ను కోచ్ పదవినుంచి తప్పించడం...ఆ తర్వాత తిరిగి ఎంపిక చేసి మళ్లీ తొలగించడం ఇది రెండో సారి. హాకీ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంపై ముకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
తనను కోచ్ పదవినుంచి తప్పిస్తున్నట్లు కనీసం సమాచారం కూడా అందించలేదని, మీడియా ద్వారానే తనకు తెలిసిందని ఆయన అన్నాడు. ‘దీనికి కారణం ఏమిటో కూడా నాకు తెలీదు. నేను 21 రోజులు జట్టుకు కోచ్‌గా పని చేశాను. మంచి ఫలితాలే వచ్చాయి. గతంలో ఇండియన్ హాకీ ఫెడరేషన్ (ఐహెచ్‌ఎఫ్) తరహాలోనే ఇప్పుడు హాకీ ఇండియా కూడా నిరంకుశంగా వ్యవహరిస్తోంది’ అని వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున 307 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 1992,96,2000 ఒలింపిక్స్ ఆడిన ముకేశ్ కోచ్ పదవికి ఎంపిక చేసిన నాటినుంచి ఇప్పటివరకు తనకెదురైన చేదు అనుభవాన్ని వివరించారు.
గత నవంబర్‌లో హరీందర్ సింగ్‌కు అసిస్టెంట్‌గా వ్యవహరించాలంటూ నన్ను జూనియర్ కోచ్‌గా నియమిస్తే తిరస్కరించాను. హరీందర్ ఆ తర్వాత వరల్డ్ సిరీస్‌కు వెళ్లిపోవడంతో నాకు మళ్లీ చీఫ్ కోచ్‌గా అవకాశం దక్కింది. 2013 ప్రపంచకప్ వరకు నన్ను కోచ్‌గా నియమిస్తేనే బాధ్యతలు స్వీకరిస్తానని ముందే చెప్పాను. దానికి హెచ్‌ఐ అంగీకరించింది. బెంగళూరులో క్యాంప్ జరిగే సమయంలో ఒక సెలక్టర్ బల్బీర్ సింగ్ ఇద్దరు కుర్రాళ్లను సూచించాడు. అయితే వారి ప్రదర్శన బాగా లేదంటూ ఆ ఇద్దరినీ ఎంపిక చేసేందుకు కోచ్‌గా నేను అంగీకరించలేదు. ఆ తర్వాత మలేసియాలో జరిగిన సుల్తాన్ జొహర్ టోర్నీలో కొరియాతో జరిగిన మ్యాచ్‌లో తొలి అర్ధ భాగంలో 5-0 ఆధిక్యంలో ఉన్న మన జట్టు ఆ తర్వాత 6-5 తేడాతో ఓడిపోయింది. ఆటగాళ్లను తిట్టి సరిగ్గా ఆడించాల్సిందంటూ హెచ్‌ఐ కార్యదర్శి నరీందర్ బత్రా నాకు సూచించారు. అయితే నేను ఆయనతో విభేదించాను. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ సందర్భంగా బత్రా నాతో వ్యక్తిగతంగా మాట్లాడాలని చెప్పారు. నన్ను సీనియర్ టీమ్‌తో కలిసి పని చేయాలని, నాబ్స్‌కు సహాయకారిగా ఉండాలని కోరారు. అయితే నాకున్న అనుభవంతో జూనియర్లను మంచి ఆటగాళ్లుగా తీర్చి దిద్దాలన్న ఆలోచనతో ఉన్న నేను దానికి ఒప్పుకోలేదు. జూనియర్ జట్టుకు ప్రపంచ కప్ గెలిపించాలనేదే నా లక్ష్యమని స్పష్టంగా చెప్పాను. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు నన్ను తొలగించినట్లు తెలిసింది. కౌశిక్‌లాంటి సీనియర్‌కు బాధ్యతలు అప్పజెపుతున్నారనుకున్నాను గానీ నాకంటే ఎంతో జూనియర్, అనుభం లేని బల్జీత్‌ను ఎంపిక చేశారని తెలిసి చాలా బాధపడ్డాను. కోచ్‌గా నేను ఎలాంటి ఆర్ధిక ప్రయోజనాలు ఆశించలేదు. అనేక సందర్భాల్లో సొంత డబ్బు ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారం ఇక భవిష్యత్తులో భారత హాకీ గురించి నేను ఆలోచించకుండా చేసింది’