డైమండ్ లీగ్‌కు కృష్ణ పూనియా

07/04/2012 21:14

 

 

 

https://www.sakshi.com/newsimages/contentimages/07042012/punia6-4-12-47722.jpgన్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి అథ్లెట్ కృష్ణ పూనియా అమెరికాలో జరిగే డైమండ్ లీగ్‌ల్లో పాల్గొననుంది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు సన్నాహకంగా ఈ లీగ్‌లు ఆమెకు ఉపయోగపడనున్నాయి. అమెరికాలో మేటి పోటీ ఈవెంట్లయిన ఈ లీగ్‌ల్లో పాల్గొనాల్సిందిగా భారత డిస్కస్ త్రోయర్‌కు ఈ మేరకు ఆహ్వానం లభించింది. తొలి డైమండ్ లీగ్ జూన్ 2 నుంచి, రెండో లీగ్ 9 నుంచి జరుగనుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారత డిస్కస్ త్రోయర్‌గా రికార్డుల్లోకెక్కిన ఆమె ప్రస్తుతం లండన్ మెగా ఈవెంట్ కోసం సన్నద్ధమవుతోంది. ‘ఒలింపిక్స్‌కు డైమండ్ లీగ్‌లు చక్కని సన్నాహక వేదికలుగా నేను భావిస్తున్నాను. రెండు ఈవెంట్లలోనూ మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాను. ఇందులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం రావడం అరుదైన అవకాశం’ అని పూనియా అన్నారు. లండన్ మెగా ఈవెంట్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు ఆమె శుక్రవారం రాత్రి అమెరికా బయల్దేరింది. పోర్ట్‌లాండ్‌లోని కాన్‌కొర్డియా యూనివర్సిటీలో మాజీ ఒలింపిక్ చాంపియన్ మాక్ విల్కిన్స్ నేతృత్వంలో మూడు నెలల పాటు శిక్షణ తీసుకోనుంది. ఒలింపిక్స్ నేపథ్యంలో ప్రత్యేక శిక్షణకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఆమెకు ఆర్థిక సాయం చేసింది.